Manipur : మణిపూర్‌లోని 4 జిల్లాలో కర్ఫ్యూ ఎత్తివేత.. కండిషన్స్ అప్లై!

అల్లర్లు, ఘర్షణలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాలైన ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది

Update: 2024-09-17 18:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో పరిస్థితులు కాస్త శాంతించాయి. అల్లర్లు, ఘర్షణలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని నాలుగు జిల్లాలైన ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్ జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అయితే, కర్ఫ్యూ సడలింపు అనంతరం ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, నిరసనలు,ర్యాలీలు తీయరాదని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంఫాల్ వెస్ట్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ కె జాదుమణి ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలో శాంతి భద్రతలు నెలకొన్న దృష్ట్యా సాధారణ ప్రజలు మందులు, ఆహార పదార్థాలు సహా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా, ఆరోగ్యం, విద్యుత్, టెలికాం, ఏటీఎం నగదు నింపడం, పెట్రోల్ పంపులు, పాఠశాలలు, కళాశాలలు, మున్సిపాలిటీ, ప్రెస్ & ఎలక్ట్రానిక్ మీడియా, కోర్టు పనితీరుతో సహా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల వంటి ముఖ్యమైన సేవలు అందించే వ్యక్తుల రాకపోకలు, విమానాశ్రయానికి వెళ్లే విమాన ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందారు. ఒకవేళ కర్ఫ్యూ మరల విధించినా వీరికి అందించే ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా వీరికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు లభించనుంది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల దృష్ట్యా మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 11 గంటల నుంచి లోయలోని జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News