కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది.

Update: 2024-06-11 14:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త కేబినెట్‌లో 28 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. వీరిలో 19 మంది మంత్రులపై హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, ద్వేషపూరిత ప్రసంగాల వరకు తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్టు పేర్కొంది. అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్, విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఉన్నట్టు తెలిపింది. వీరిద్దరూ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నానికి సంబంధించిన కేసులను అఫిడవిట్‌లో ప్రకటించినట్టు పేర్కొంది. అలాగే మరో ఐదుగురు మంత్రులపై ఐదుగురిపై మహిళల వేధింపుల కేసులు ఉన్నాయి. ఇక, ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన కేసుల్లో ఎనిమిది మంది మంత్రులు ఉన్నట్టు గుర్తించింది.

99 శాతం మంది కోటీశ్వరులే

కొత్త మంత్రి మండలిలోని 71 మంది మంత్రుల్లో 70 మంది కోటీశ్వరులేనని, వారి సగటు ఆస్తులు రూ.107.94 కోట్లు అని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మంత్రుల్లో ఆరుగురు తమ అధిక ఆస్తుల ప్రకటనలకు ప్రత్యేకించి ఒక్కొక్కరు రూ.100 కోట్లకు పైగా ఉన్నారని తెలిపింది. రూ.5,705.47 కోట్ల విలువైన ఆస్తులతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల్లో రూ.5,598.65 కోట్లు చరాస్తులు, రూ.1,06.82 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. కాగా, జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రి మండలిలో ప్రధాని మోడీ సహా 72 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. 


Similar News