Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయ సరిహద్దు గోడలపై పగుళ్లు

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ(Puri Jagannath Temple) సరిహద్దు గోడపై పగుళ్లు ఏర్పడ్డాయి. సరిహద్దు గోడ మేఘనాద్ పచేరీపై పగుళ్లు ఏర్పడటంతో ఆలయ నిర్మాణం, భద్రతపై ఆందోళనలు తలెత్తాయి.

Update: 2024-11-04 10:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ(Puri Jagannath Temple) సరిహద్దు గోడపై పగుళ్లు ఏర్పడ్డాయి. సరిహద్దు గోడ మేఘనాద్ పచేరీపై పగుళ్లు ఏర్పడటంతో ఆలయ నిర్మాణం, భద్రతపై ఆందోళనలు తలెత్తాయి. 12వ శతాబ్దాల నాటి కట్టడంపై పగుళ్లు ఏర్పడిన తర్వాత ఆలయంలో పగుళ్లపై ప్రభుత్వం ఆరా తీసింది. పగుళ్లను సరిచేయడానికి ఒడిశా ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) సహాయం కోరింది. ఆలయంలో పగుళ్లు రావడంతో సేవకులు ఆందోళనకు దిగారు. ఆలయ గోడల నుంచి మురికి నీరు కారుతోంది. ఈ మురికి నీరు ఆనందబజార్ నుంచి రైసర్ లోపలకు వస్తోంది. మురికి నీరు లీక్ కావడంతో ఆలయ గోడలోని కొన్ని చోట్ల నాచు పేరుకుని మచ్చలు కనిపిస్తున్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే ఆలయ గోడతో సహా ఆలయాన్ని భారత పురావస్తు శాఖ తనిఖీ చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ తనిఖీ సమయంలో ఆలయానికి చెందిన సాంకేతిక బృందం కూడా ఉంది. భారత పురావస్తు శాఖ ద్వారా ఆలయ మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తారని తము ఆశిస్తున్నామని తెలిపారు.

మంత్రి ఏమన్నారంటే?

ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని మరమ్మతు పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. తద్వారా ఎలాంటి సమస్య తలెత్తదని అన్నారు. “ ఆలయ ప్రాంగణం చుట్టూ చేసిన కార్యకలాపాలవల్ల వల్ల ఆలయంలో పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో జరిగిన తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. ఆలయంలో మురికి నీరు కారుతోంది. గోడల పగుళ్ల మధ్య నుంచి మురికి నీరు రావడంతో గోడలపై నాచు కూడా రావడం మొదలైంది. అయితే ఈ పగుళ్లను ఏఎస్‌ఐ బృందం త్వరలో సరిచేయనుంది. దీనిపై, విచారణ చేపట్టిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఏఎస్ఐ పర్యవేక్షణలో గోడను మరమ్మతు చేయడం మా మొదటి ప్రాధాన్యత” అని చెప్పారు.


Similar News