అలా అయితేనే రీ-ఎగ్జామ్‌కు ఆదేశిస్తాం: నీట్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తుంది.

Update: 2024-07-18 07:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యూజీ 2024కి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారిస్తుంది. ఈ సందర్భంగా నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం పరీక్ష పవిత్రత కోల్పోయినప్పుడే, ఒక నిర్దిష్ట ప్రాతిపదికన మాత్రమే రీ-ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారిస్తుంది.

మొత్తం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దాఖలు చేసిన వాటితో సహా 40కి పైగా పిటిషన్‌లపై విచారణ జరుగుతుంది. ప్రస్తుతం నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. దీనిలో భాగంగా విచారణ నివేదికను తాజాగా సుప్రీంకోర్టులో అందించారు. అయితే దాని వివరాలను బయటకు వెల్లడిస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తెలిపారు. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ పేపర్ లీక్ కేసులో ముగ్గురు ఎయిమ్స్ పాట్నా విద్యార్థులను తాజాగా అదుపులోకి తీసుకుంది.


Similar News