ఆప్ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు.. ఆస్తుల అటాచ్‌కు కోర్టు ఆదేశాలు

నోయిడా పెట్రోల్ పంపు అటెండర్‌పై దాడి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌, అతని కుమారుడికి కష్టాలు మరింత తీవ్రమైనట్లు కనిపిస్తుంది

Update: 2024-05-31 09:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: నోయిడా పెట్రోల్ పంపు అటెండర్‌పై దాడి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌, అతని కుమారుడికి కష్టాలు మరింత తీవ్రమైనట్లు కనిపిస్తుంది. ఈ కేసులో పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. నోయిడా కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఆస్తులను అటాచ్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు నోటీసుకు స్పందించకపోతే, కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయన ఆస్తులను అటాచ్ చేయనున్నారు.

కొద్ది వారాల క్రితం సెక్టార్ 95లోని నోయిడా పెట్రోల్ పంప్‌లో అమానతుల్లా ఖాన్‌ కుమారుడు అనాస్ తన కారులో ముందుగా పెట్రోల్ నింపమని డిమాండ్ చేయగా, సిబ్బంది లైన్‌లో రమ్మని చెప్పడంతో అనాస్‌ అక్కడి ఉద్యోగులను కొట్టారు. ఈ ఘర్షణ తరువాత అమానతుల్లా కూడా బంక్‌కు చేరుకుని ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి అమానతుల్లా ఖాన్‌, అనాస్‌ ఇద్దరు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ఇప్పుడు కోర్టు వారి ఆస్తుల అటాచ్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకుముందు వారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, అయితే వారి అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. పెట్రోల్ బంక్ వద్ద అమానతుల్లా ఖాన్‌ కుమారుడు అక్కడి సిబ్బందిపై దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డు, కాగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Similar News