2001 నాటి హత్య కేసులో దోషిగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌

ఒక హత్య కేసుకు సంబంధించి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను గురువారం ముంబైలోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.

Update: 2024-05-30 09:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒక హత్య కేసుకు సంబంధించి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను గురువారం ముంబైలోని ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. 2001లో హోటల్ వ్యాపారి జయ శెట్టిని హత్య చేశారనే ఆరోపణలు రాగా, తాజాగా విచారణ చేపట్టగా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద ప్రత్యేక న్యాయమూర్తి AM పాటిల్ ఛోటా రాజన్‌ను దోషిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో శిక్ష కాలాన్ని తర్వాత కోర్టు ప్రకటిస్తుంది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, సెంట్రల్ ముంబైలోని గామ్‌దేవి వద్ద ఉన్న గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయశెట్టి. ఆయనకు ముంబైలో గ్రాంట్ రోడ్‌లోని ఒక రెస్టారెంట్‌తో సహా నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. జయశెట్టికి అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను నుంచి తరుచుగా డబ్బులు చెల్లించమని బెదిరింపులు వచ్చేవి. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరగా, మహారాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. ఆ తరువాత దానిని ఉపసంహరించుకున్నారు.

ఈ క్రమంలో మే 4, 2001న హోటల్ మొదటి అంతస్తులో ఇద్దరు ముఠా సభ్యులు జయశెట్టిని కాల్చి చంపారు. ఈ హత్యకు ఛోటా రాజన్, అజయ్ మోహితే, ప్రమోద్ ధోండే, రాహుల్ పన్సారేలు కలిసి కుట్ర పన్నారని ముంబైలోని ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఇంతకుముందు ఇదే కేసులో ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించగా, ఇప్పుడు ఛోటా రాజన్‌ను దోషిగా గుర్తించింది. 2011లో సంచలనం సృష్టించిన జర్నలిస్టు జే డే హత్యతో సహా మహారాష్ట్రలో దాదాపు 70 కేసుల్లో ఛోటా రాజన్ నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్‌స్టర్‌ను 25 అక్టోబర్ 2015న ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో అరెస్టు చేసి భారత్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఛోటా రాజన్‌ను ఢిల్లీలోని అత్యంత భద్రత కలిగిన తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు.


Similar News