'మూడో ప్రపంచ యుద్ధం జరగొచ్చు'.. ఇజ్రాయెలీ చరిత్రకారుడు సంచలన వ్యాఖ్యలు

Update: 2023-10-16 16:31 GMT

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై ప్రముఖ ఇజ్రాయెలీ రచయిత, చరిత్రకారుడు యువల్ నోహ్ హరారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ముప్పు ఉందన్నారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పలు దేశాలు గాజా యుద్ధంలోకి ఎంటరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. భౌగోళిక, ప్రాదేశిక ప్రయోజనాల కోసం ఆయా దేశాలు యుద్ధ భూమిలోకి ప్రవేశించాల్సిన అనివార్య పరిస్థితులు ఇప్పటికే చుట్టుముట్టి ఉన్నాయని తెలిపారు.

గాజా యుద్ధం ఇంకా కొనసాగితే.. ఈ దిశగా పరిణామాలు చకచకా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని యువల్ నోహ్ హరారీ అంచనా వేశారు. మరిన్ని దేశాలు ఈ యుద్ధంలోకి చేరితే.. అది ప్రపంచ యుద్ధం దిశగా బాటలు వేసే రిస్క్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ జరగకూడదంటే.. తమ దగ్గరున్న బందీలను బేషరతుగా హమాస్ మిలిటెంట్లు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ దిశగా నిర్ణయాలు వెలువడితే.. యావత్ ప్రపంచంపై నుంచి యుద్ధ మేఘాలు తొలగిపోతాయన్నారు.


Similar News