పాక్‌లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్‌పై ఉగ్రదాడి..

పాకిస్థాన్‌‌లో చైనాకు చెందిన ఇంజినీర్ల వాహన కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది.

Update: 2023-08-13 10:27 GMT

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌‌లో చైనాకు చెందిన ఇంజినీర్ల వాహన కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానికంగా ఉన్న ఫకీర్‌ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఒక చైనా ఇంజినీరు, భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ వెల్లడించింది.

పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవానికి (ఆగస్టు 14) ఒక రోజు ముందు ఈ దాడి జరగడం గమనార్హం. గ్వాదర్‌ పోర్టుపై చైనా పెత్తనం చేస్తుండటంపై స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. గతేడాది మే నెలలో ఓ మహిళ కరాచీలోని విశ్వవిద్యాలయం సమీపంలో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడి కూడా బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీనే చేయించింది.


Similar News