లోక్ సభలో రాహుల్ ప్రసంగంపై వివాదం.. రికార్డుల నుంచి పలు వ్యాఖ్యల తొలగింపు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Update: 2024-07-02 13:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగం సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశాలు మేరకు రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పార్లమెంటు రికార్డుల నుంచి మంగళవారం తొలగించారు. రికార్డుల నుంచి తీసేసిన వాటిలో హిందువులు, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలపై, అగ్నివీర్‌ పథకం, నీట్ పరీక్షపై చేసిన వ్యాఖ్యలలోని కొన్ని భాగాలను కూడా డిలీట్ చేసినట్టు లోక్ సభ సెక్రటేరియట్ తెలిపింది.

ఆ వ్యాఖ్యలు రూల్ 380 పరిధిలోకి రావు: రాహుల్

తన వ్యాఖ్యలలోని రికార్డులు తొలగించిన కాసేపటికే రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రికార్డుల నుంచి తీసేసిన వ్యాఖ్యలు రూల్ 380 పరిధిలోకి రావని తెలిపారు. వాస్తవ పరిస్థితులను మాత్రమే వివరించినట్టు పేర్కొన్నారు. ప్రసంగంలోని చాలా భాగాన్ని డిలిట్ చేయడం చూసి ఆశ్చరపోయానని వెల్లడించారు. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(1)లో పొందుపరిచిన విధంగా.. ప్రజల భావాలను వ్యక్తికరించే స్వాతంత్య్రం ప్రతి సభ్యుడికి ఉంది. రికార్డుల నుంచి వ్యాఖ్యలు తీసివేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధం. కాబట్టి తొలగించిన కామెంట్స్‌ను వెంటనే పునరుద్దరించాలి’ అని పేర్కొన్నారు. అయితే శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, రాహుల్ వ్యాఖ్యలను సమర్ధించారు. రాహుల్ హిందూ సమాజం గురించి తప్పుగా మాట్లాడలేదని తెలిపారు.  

Similar News