ఎస్‌సీఓ సమ్మిట్‌లో చైనా, పాక్‌లపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ తరపున ప్రసంగించిన జైశంకర్ పరస్పర గౌరవం,అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వంటి అంశాలను ప్రస్తావించారు

Update: 2024-07-04 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కజకిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాకిస్తాన్‌లపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎస్‌సీఓ సార్వభౌమాధికారం, సమగ్రతకు గౌరవడం, కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో వివక్షత లేని వాణిజ్య హక్కుల వంటి సమస్యలను పరిష్కరించాలని పరోక్షంగా పాకిస్తాన్, చైనాలపై వ్యాఖ్యానించారు. ఎస్‌సీఓ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తరపున ప్రసంగించిన జైశంకర్ పరస్పర గౌరవం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)లో కీలకమైన పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గుండా వెళ్తున్న నేపథ్యంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి బలమైన అనుసంధానం అవసరమని, ఇది దేశాల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. ఉగ్రవాదంపై పోరాటం ఎస్‌సీఓ ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలని, ఏదోక విధంగా ఉగ్రవాదాన్ని నియంత్రించకపోతే అనేక దేశాల, ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారవచ్చని జైశంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను అంతర్జాతీయ సమాజం బట్టబయలు చేయాలని, ఆయా దేశాలను ఏకాకిని చేయాలంటూ పాకిస్తాన్‌తో పాటు చైనాను ఉద్దేశించి జైశంకర్ వ్యాఖ్యానించారు. పాక్ టెర్రరిస్టులను బ్లాక్‌లిస్టులో చేర్చాలని ఐక్యరాజ్యసమితికి భారత్ తీర్మానాలను సమర్పించిన సందర్భాల్లో చైనా దాన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో జైశంకర్ ఈ అంశాలను ప్రస్తావించారు.  


Similar News