మోడీ వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్

రాజ్యాంగంలోని 115(1) నిబంధనల ప్రకారం మోడీ, అనురాగ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Update: 2024-07-04 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో బీజేపీ విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు టిట్-ఫర్-టాట్ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌లు సభలో 'అవాస్తవాలను, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు' చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 115(1) నిబంధనల ప్రకారం మోడీ, అనురాగ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఏ ఎంపీ అయినా సభలో అవాస్తవాలు మాట్లాడితే సభాముఖంగా వాటిపై వ్యాఖ్యలు చేయడానికి ముందు స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చల అనంతరం సదరు వ్యాఖ్యలు తప్పని నిరూపితమైతే రికార్డుల నుంచి తొలగిస్తారు. ఇటీవల ప్రధాని మోడీ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ.. మహిళలకు రూ. 8,500 చొప్పున నెలనెలా ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. దీన్ని ప్రస్తావించిన మాణిక్యం ఠాగూర్, గెలిచి అధికారంలోకి వచ్చాక ఇచ్చేందుకు హామీ ఇచ్చామని, అది తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అలాగే, ఒంటరిగా పోటీ చేసిన 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిందన్న ప్రధాని మోడీ వాదనను సవాలు చేస్తూ.. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓట్ షేర్ గణనీయంగా పెరిగిందని, ఇది మోడీ తప్పుడు ప్రకటనలు చేయడమే అవుతుందన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఆర్మీ జవాన్‌లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కేంద్రం ఇవ్వలేదని మోడీ అన్నారు. తమ హయాంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ల కొరత ఉన్నది నిజమే అయినప్పటికీ, అస్సలు ఇవ్వలేదని మోడీ చెప్పడం సమంజసం కాదన్నారు. సైన్యానికి కాంగ్రెస్ యుద్ధ విమానాలు ఇవ్వలేదన్న వాదనను ఖండిస్తూ.. యూపీఏ హయాంలో మిగ్ 29, జాగ్వార్, మిరాజ్-2000, ఎస్‌యూ-30 వంటి ఫైటర్ జెట్‌లు, అగ్ని, ఆకాశ్, బ్రహ్మోస్, త్రిశూల్ లాంటి క్షిపణులు ఉన్నాయన్నారు. ఇక, ప్రధాని మోడీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ, ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఏ రకమైన సెలవులు తీసుకున్నారో చెప్పాలని మాణిక్యం ఠాకూర్ లేఖలో పేర్కొన్నారు. 


Similar News