జమ్ము, కశ్మీర్ లలో ప్రజాతీర్పులో వైరుధ్యం

Update: 2024-10-08 11:31 GMT

దిశ, వెబ్ డెస్క్ : పదేళ్ళ తర్వాత జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం కోసం బీజేసీ వేసిన వ్యూహాలు ఫలించకపోయినా తనకు గతంలో పట్టు్న్న ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుని కొంత ఉపశమనం పొందిందంటున్నారు విశ్లేషకులు. 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసింది మోదీ సర్కార్. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అలాగే, లడఖ్ కూడా దాని నుండి వేరు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన 1890 రోజుల తరువాత నిర్వహించిన ఎన్నికల్లోనూ జమ్మూ, కశ్మీర్ లోని ప్రజా తీర్పులో గందరగోళం మాత్రం స్పష్టమైంది. జమ్మూ మైదాన ప్రాంతాల్లోని నియోజకవర్గా్ల్లో బీజేపీ పట్టు నిలుపుకోగా, కశ్మీర్ లోయలో మాత్రం ఇండియా కూటమి పార్టీలు ఆధిపత్యం చలాయించాయి.

ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కశ్మీర్ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారని భావించారు. కానీ ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఫలితాల సరళి కనిపించింది. 2014నుంచి 2024వరకు ఎన్నికలకు దూరంగా ఉన్నా జమ్మూ కశ్మీర్‌ ప్రజల మధ్య ప్రజాస్వామిక తీర్పులో వైరుధ్యం మాత్రం తొలగిపోలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతంగా లడక్ ఏర్పాటు , నియోజకవర్గాల పునర్విభజన వంటి అనేక విధాన పర నిర్ణయాలు, సంస్కరణలు సైతం పర్వత, లోయ ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఏకాభిప్రాయం తీసుకరాలేకపోయింది. జమ్మూలోని 43 స్థానాలకు గాను మెజార్టీ స్ధానాల్లో బీజేపీ, కశ్మీర్‌లోని 47 సీట్లలో కాంగ్రెస్ కూటమి మెజార్టీ సీట్లలో ఆధిక్యం చాటాయి. 


Similar News