Arvind Kejriwal : పంజాబ్‌ను, పంజాబీలను బద్నాం చేసేందుకు శక్తివంతుల కుట్రలు : కేజ్రీవాల్
దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను బద్నాం చేసే దురుద్దేశంతో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో : పంజాబ్ రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను బద్నాం చేసే దురుద్దేశంతో కొందరు కుట్రలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఖండించారు. పంజాబ్ పోలీసులు సత్వరం స్పందించినందు వల్లే సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు పెనుముప్పు తప్పిందన్నారు. లా అండ్ ఆర్డర్‌ను ఎలా నిర్వహించాలో ప్రపంచానికి పంజాబ్ పోలీసులు చాటి చెప్పారని కేజ్రీవాల్ కొనియాడారు.
బుధవారం ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పంజాబ్, పంజాబీల ప్రతిష్ఠను మసకబార్చేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది. దీని వెనుక కొందరు శక్తివంతమైన వాళ్లు ఉన్నారు’’ అని ఆప్ చీఫ్ వ్యాఖ్యానించారు. ‘‘సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే పంజాబ్‌లో లా అండ్ ఆర్డర్‌పై బీజేపీ ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. హత్యాయత్నాన్ని పంజాబ్ పోలీసులు విఫలం చేశారనే విషయాన్ని వాళ్లు చెప్పడం మర్చిపోతున్నారు’’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.