DRI: 2023-24లో 8,224 కిలోల డ్రగ్స్, 1,319 కిలోల బంగారం స్వాధీనం
2023-23లో 21 కొకైన్ అక్రమ రవాణా కేసులు బుక్ కాగా, 2023-24లో ఏకంగా 47 కేసులు నమోదయ్యాయని డీఆర్ఐ నివేదిక తెలిపింది
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోకి అక్రమ మార్గాల ద్వారా డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు, బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను తీసుకొస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల వీటికి సంబంధించి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్‌ఐ) గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ అధికారులు ఏకంగా 8,223.61 కిలోల మాదకద్రవ్యాలను, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన 109 కేసులను బుక్ చేశారు. ఇందులో 107.31 కిలోల కొకైన్, 48.74 కిలోల హెరాయిన్, 136 కిలోల మెథాంఫెటమైన్, 236 కిలోల మెఫెడ్రోన్, 7,348.68 కిలోల గంజాయి ఉన్నాయి. ఈ కేసులు కొకైన్ అక్రమ రవాణా పెరుగుతున్న ధోరని సూచిస్తున్నాయని, 2023-23లో 21 కేసులు బుక్ కాగా, 2023-24లో ఏకంగా 47 కేసులు నమోదయ్యాయని డీఆర్ఐ నివేదిక తెలిపింది. డీఆర్ఐ 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బుధవారం విడుదల చేసిన నివేదికలో.. దేశీయంగా కొకైన్ అక్రమ రవాణా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దక్షిణ అమెరికా నుంచి, ఆఫ్రికా దేశాల ద్వారా ప్రత్యక్ష మార్గాల ద్వారా ఇవి జరుగుతున్నాయి. వాయుమార్గంలో కొకైన్ స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఇది భారత చట్టాల అమలు సంస్థలకు గణనీయమైన సవాలుగా మారినట్టు కనిపిస్తుంది.
2023-24లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ. 974.78 కోట్లు, అలాగే, పట్టుకున్న హెరాయిన్ విలువ రూ. 365 కోట్లు, మెథాంఫెటనైన్ విలువ రూ. 275 కోట్లు, గంజాయి విలువ రూ. 21 కోట్లు. మాదకద్రవ్యాల తర్వాత అక్రమంగా తరలిస్తున్న బంగారం కూడా గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. సమీక్షించిన కాలంలో వెయ్యికి పైగా కిలోల పసిడి పట్టుబడగా, భూమార్గంలో 55 శాతం, వాయుమార్గంలో 36 శాతం స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి ఎక్కువ బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది.