Orissa High Court: 'పరస్పర అంగీకార శృంగారం అత్యాచారం కాదు'.. హైకోర్టు సంచలన తీర్పు

పరస్పర అంగీకారంతో శృంగారం జరిగాక.. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి

Update: 2023-07-07 17:05 GMT

భువనేశ్వర్‌ : పరస్పర అంగీకారంతో శృంగారం జరిగాక.. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించినా ఆ శారీరక కలయికను రేప్ గా పరిగణించలేమని ఒడిశా హైకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే.. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన మహిళ ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని రోజులు సహజీవనం చేశాడు. మోజు తీరాక ఆమెను వదిలి పారిపోయాడు.

దీంతో కంగుతిన్న మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నిందితుడి విన్నపాన్ని కోర్టు నిరాకరించింది. చేసేది లేక నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ.. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసినందుకు దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. నిందితుడికి బెయిల్ ఇచ్చింది. బాధిత మహిళను బెదిరించవద్దని.. అతడికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది.


Similar News