Congress: జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్.. ఆరుగురు అభ్యర్థులకు చోటు

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది.

Update: 2024-09-02 12:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం ఈ లిస్టును ప్రకటించారు. ఈ జాబితాలో జమ్మూ కాంగ్రెస్ చీఫ్ కర్రాతో పాటు, రియాసీ నియోజకవర్గం నుంచి ముంతాజ్ ఖాన్, మాతా వైష్ణో దేవి సెగ్మెంట్‌లో భూపేందర్ జమ్వాల్, రాజౌరి నుంచి ఇఫ్తికార్ అహ్మద్, తన్నమండి నుంచి షబ్బీర్ అహ్మద్ ఖాన్, సూరంకోట్ నుంచి మహ్మద్ షానవాజ్ చౌదరిలకు చోటు దక్కింది. రెండో విడతలో ఈ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

దీంతో కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం అభ్యర్థులసంఖ్య 15కు చేరుకుంది. అంతకుముందు 9 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను విడుదల చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, జమ్మూ కశ్మీర్‌ స్క్రీనింగ్‌ కమిటీ చీఫ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా, సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు హాజరయ్యారు. కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ 51, కాంగ్రెస్‌ 32 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 


Similar News