లోక్‌సభలో కాంగ్రెస్.. 100 క్రాస్ ?

దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెల్చుకుంది. త్వరలోనే ఆ సంఖ్య 100కు చేరే అవకాశం ఉంది.

Update: 2024-06-07 18:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెల్చుకుంది. త్వరలోనే ఆ సంఖ్య 100కు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన రెబల్ అభ్యర్థి విశాల్ పాటిల్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో కలిసి తన మద్దతును ప్రకటించారు. ఈసందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ ట్వీట్ చేశారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా మహారాష్ట్రలోని సాంగ్లీ లోక్‌సభ స్థానాన్ని శివసేన (ఉద్ధవ్)కు కేటాయించారు. దీంతో అక్కడి నుంచి విశాల్ పాటిల్ కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు. విశాల్ పాటిల్ చేతిలో బీజేపీ అభ్యర్థి సంజయ్‌కాక పాటిల్‌ ఓడిపోయారు.

విశాల్ పాటిల్ కుటుంబం వివరాల్లోకి వెళితే.. ఈయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతదాదా పాటిల్ మనవడు. మొదటినుంచీ కాంగ్రెస్ నేపథ్యం ఉండటంతో.. ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌లోనే విశాల్ పాటిల్ చేరారు. కాగా, బిహార్‌లోని పూర్నియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన పప్పూ యాదవ్ కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని అంచనా వేస్తున్నారు. బిహార్‌లో ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా పూర్నియా సీటును ఆర్జేడీకి కేటాయించారు. దీంతో ఆ సమయానికి కాంగ్రెస్‌లో ఉన్న పప్పూ యాదవ్‌కు భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన రెబల్‌గా పోటీ చేసి గెలిచారు.


Similar News