Nirmala Sitharaman: కుటుంబం కోసమే రాజ్యాంగ సవరణ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

సంకీర్ణ భాగస్వామ్య పక్షాల ఒత్తిడితో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు.

Update: 2024-12-16 10:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుటుంబం కోసం నిస్సంకోచంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కీలక సవరణలు చేసిందని విమర్శించారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల ఒత్తిడితో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీని 'మహిళా వ్యతిరేకి' అని ఆమె అభివర్ణించారు. 50 ఏళ్ల పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలు భారత ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయలేదన్నారు. ప్రతిసారీ కాంగ్రెస్ ఎలాంటి బెదురు లేకుండా కుటుంబం కోసమే రాజ్యాంగాన్ని సవరించింది. రెండో ప్రపంచయుద్ధం అనంతరం 50 దేశాలకు స్వాతంత్ర్యం దక్కింది. ఆయా దేశాలు రాజ్యాంగాన్ని రచించుకున్నాయి. ఆ తర్వాత అనేక దేశాలు తమ రాజ్యాంగ ఉద్దేశాన్ని మార్చుకున్నాయి. కానీ భారత రాజ్యాంగం అనేక పరీక్షలు ఎదుర్కొని నిలబడింది. కాంగ్రెస్ పాలనలో వాక్ స్వానత్ర్యాన్ని అణచేందుకు సవరణలు చేసింది. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అంటూ ప్రసంగాలు చేస్తోందని నిర్మలా సీతారామన్ ఘాటుగా విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా 42వ రాజ్యాంగ సవరణతో వివిధ సవరణలను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి, ఈ సవరణలేవీ ఆర్థికపరమైన సానుకూలత, సామాజిక ఉద్దేశం, విధి నిర్వహణ, రాజ్యాంగ స్పూర్తి వంటి ప్రమాణాల పరీక్షల్లో సఫలం కాలేదన్నారు. ఈ సవరణలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కాకుండా, అధికారంలో ఉన్నవారిని రక్షించడానికి, కుటుంబ రాజకీయాల కోసమే ఉపయోగించారని ఆమె అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోవియట్ మోడల్‌ను స్వీకరించారని, ఇందిరాగాంధీ దాన్ని ముందుకు తీసుకువెళ్లారని, అయితే సోషలిస్టు నమూనా భారత్‌కు ప్రయోజనం కలిగించలేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  

Tags:    

Similar News