Beggar-Free City : యాచకులకు డబ్బు ఇస్తే కేసు నమోదు.. ఎక్కడంటే..?
బెగ్గర్ ఫ్రీ జిల్లా లక్ష్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : బెగ్గర్ ఫ్రీ జిల్లా లక్ష్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాచకులకు డబ్బులిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇండోర్‌లో బెగ్గింగ్ బ్యాన్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ సోమవారం మీడియాకు తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి బిక్షాటనపై తమ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. జనవరి 1 నుంచి ఎవరైనా యాచకులకు డబ్బులిస్తే మాత్రం కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. స్థానికులు ఎవరూ యాచకులకు డబ్బులిచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. బిక్షాటన కోసం ప్రజలను దోపిడీ చేసే ముఠాలు ఇటీవల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. బిక్షాటన చేసే అనేక మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బిచ్చగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పైలెట్ ప్రాజెక్ట్ కోసం 10 నగరాలను ఎంపిక చేసింది. అందులో ఇండోర్ సిటీ ఒకటిగా ఉంది.