TM Krishna : టీఎం కృష్ణకు సుప్రీంకోర్ట్ షాక్
దివంగత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు(MS Subbalaxmi Award) గ్రహీతగా కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణ(TM Krishna)ను గుర్తించకూడదని సుప్రీంకోర్టు(SupremeCourt) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
దిశ, వెబ్ డెస్క్ : దివంగత గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు(MS Subbalaxmi Award) గ్రహీతగా కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణ(TM Krishna)ను గుర్తించకూడదని సుప్రీంకోర్టు(SupremeCourt) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. అదేవిధంగా కృష్ణ, మ్యూజిక్ అకాడమీ, ది హిందూ, THG పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాలుగు వారాల్లోగా వివరణ కోరుతూ ధర్మాసనం నోటీసు జారీ చేసింది. సుబ్బులక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అవార్డు వెనక్కి తీసుకోవాలని సుబ్బులక్ష్మి మనవడు శ్రీనివాసన్(Srinivasan) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీన్భట్టితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీన్ని అసాధారణ విషయంగా పరిగణించాలని, కృష్ణ సుబ్బులక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కథనాలు రాశారని అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్వెంకటరామన్ వాదనలు వినిపించారు. అనంతరం టీఎం కృష్ణను సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించకూడదని ఆదేశించింది. కృష్ణ స్వతహాగా గొప్ప గాయకుడు అని, అందులో ఎలాంటి సందేహం లేదని జస్టిస్ భట్టి తెలిపారు. ఈ ఉత్తర్వులు కృష్ణ గాన సామర్థ్యాలకు ప్రతిబింబంగా చూడరాదని జస్టిస్ రాయ్ వ్యాఖ్యానించారు.
వివాదం ఏమిటి?
2004లో సుబ్బలక్ష్మి మరణం తర్వాత ఆమె పేరిట 2005 నుంచి చెన్నైకి చెందిన మ్యూజిక్ అకాడమీ ఈ అవార్డును అందిస్తోంది. అలా 2024కి గాను టీఎం కృష్ణకు అవార్డు ఇవ్వనున్నట్లు అకాడమీ ప్రకటించింది. దీనిపై ఎంఎస్ సుబ్బలక్ష్మి మనవడు శ్రీనివాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో సుబ్బలక్ష్మిపై టీఎం కృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి వ్యక్తిని ఎలా ఆమె అవార్డుతో సత్కరిస్తారని శ్రీనివాసన్ ప్రశ్నించారు. కృష్ణకు అవార్డు ఇవ్వవద్దంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మద్రాసు హైకోర్టు కృష్ణకు అవార్డు ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వగా, ఆదివారం అందించారు. ఆ తర్వాత శ్రీనివాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.