ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు 75 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల
ఒడిశాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 75 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్.
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు 75 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. మాజీ సీఎం జేబీ పట్నాయక్ కుమారుడు పృథ్వీ బల్లవ్ పట్నాయక్, కేంద్రమాజీ మంత్రి కేపీ సింగ్ డియో బంధువు సుస్మితా డియోకు ఆ జాబితాలో చోటు దక్కింది.
75 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. తలసారా, బలిగూడ, కబీసూర్యనగర్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. భారత హాకీ మాజీ కెప్టెన్ ప్రబోధ్ టిర్కీ స్థానంలో దేబేంద్ర బిటారియాను తలసారా నుంచి అభ్యర్థిగా ఎంపిక చేసింది హైకమాండ్. బలిగూడ సిట్టింగ్ ఎమ్మెల్యే సురదా ప్రధాన్ స్థానంలో ఉపేంద్ర ప్రధాన్ పోటీ చేయనున్నారు. అదేవిధంగా కబీసూర్యనగర్ స్థానానికి చిరంజీవి బిసోయి స్థానంలో బిపిన్ బిహారీ స్వైన్ బరిలో నిలిచారు.
ఔల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ స్థానంలో ఆయన కుమార్తె డాక్టర్ దేబస్మిత శర్మకు టికెట్ దక్కింది. బీజేడీకి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే జుగల్ పట్నాయక్ కుమారుడు అసిత్ పట్నాయక్ కు టికెట్ దక్కింది. భద్రక్ నియోజకవర్గం నుంచి అసిత్ పోటీ చేయనున్నారు.
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. సురేశ్ రౌత్రాయ్, అధిరాజ్ పాణిగ్రహికి టికెట్ దక్కలేదు. జటాని నియోజకవర్గ ఎమ్మెల్యే సురేశ్ రౌత్రాయ్ 2024 ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోని ప్రకటించారు. ఇకపోతే, ఖరియార్ ఎమ్మెల్యే అధిరాజ్ పాణిగ్రహి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ఖరియార్ నుంచి బీజేపీ తరఫున అధిరాజ్ పాణిగ్రహి పోటీ చేయనున్నారు.
కాంగ్రెస్ ఒడిశా మాజీ అధ్యక్షులు నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా.. భండారేపోఖరి, ఆనందపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. బంకి స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే దేబాశిష్ పట్నాయక్ బరిలో నిలిచారు. బీజేపీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హింజిలి నుంచి పోటీ చేస్తున్నారు. అదే స్థానానికి కాంగ్రెస్ తరఫున రజనీకాంత పాధి పోటీ చేయనున్నారు.
ఒడిశాలోని 147 స్థానాలకు గాను ఇప్పటివరకు 119 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. సీపీఎం, జేఎంఎఁలతో రెండు సీట్లు సర్ధుబాటు అయ్యాయి.