Cold Weather: దేశవ్యాప్తంగా పెరిగిన చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు 8-14 డిగ్రీల ఉష్ణోగ్రతలతో చల్లటి వాతావరణాలను చూశాయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. కొన్ని ప్రాంతాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4-8 డిగ్రీల వరకు పడిపోయాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ ప్రాంతాలు 8-14 డిగ్రీల ఉష్ణోగ్రతలతో చల్లటి వాతావరణాలను చూశాయి. చాలా ప్రాంతాలలో 1-2 డిగ్రీల క్షీణత నమోదు కాగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో మైనస్ 5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ వ్యత్యాసాలతో సాధారణం కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్‌లోని అడంపూర్ ఐఏఎఫ్ అతి శీతల ప్రదేశంగా నిలిచింది. ఇక్కడ కనిష్టంగా కేవలం 1.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్ ప్రాథమిక వాతావరణ కేంద్రం ప్రకారం, ఢిల్లీలో 4.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోపోవడంతో ప్రజలు ఆదివారం ఉదయం ఎముకలు కొరికే చలిని ఎదుర్కొన్నారు. వాయువ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రాబోయే ఐదు రోజుల పాటు స్థిరంగా ఉంటాయని అంచనా. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీతో సహా ఇతర ప్రాంతాలు కూడా డిసెంబర్ 15-19 మధ్య చలిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దక్షిణాదిలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్, నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా.