Yogi : సంభల్‌లో ఆలయం చరిత్ర చెప్పిన సత్యం : యోగీ ఆదిత్యనాథ్

సంభల్‌లో రాత్రికి రాత్రే ఆలయాన్ని తెరవలేదని.. అది మన శాశ్వత వారసత్వమని, చరిత్ర మనకు చెప్పిన సత్యం అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.

Update: 2024-12-15 17:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సంభల్‌లో రాత్రికి రాత్రే ఆలయాన్ని తెరవలేదని.. అది మన శాశ్వత వారసత్వమని, చరిత్ర మనకు చెప్పిన సత్యం అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం మహా కుంభమేళాపై నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంభల్‌లో 1978 తర్వాత ఆలయాన్ని తెరవడంపై స్పందిస్తూ.. ‘46 ఏళ్ల క్రితం సంభల్‌లో అనాగరిక హింసతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాల తర్వాత కూడా కుంభామేళాను అణిచివేసేందుకు, సాంస్కృతిక కార్యక్రమాలను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు. 45 రోజుల పాటు ప్రయాగ్ రాజ్‌లో జరిగే మహాకుంభా మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. వంద కోట్ల మందికి సరిపడా వసతులకు ఏర్పాట్లు చేశాం. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు దేశ వారసత్వానికి తామే ఓనర్లమని భావిస్తున్నారు. శ్రీరామ జన్మభూమిపై సుప్రీం తీర్పు దశాబ్ధాలుగా ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అయినా కొంత మంది తీర్పు చెప్పిన న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు.’ అని యోగి అన్నారు. ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఉటంకిస్తూ.. రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు వంచన చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశ వారసత్వం కోసం నిలబడే ఎవరినైనా భయపెట్టాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాశీ, అయోధ్య ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రతిపక్షాలకు సమస్యగా మారింది. వైఫల్యాల నుంచి వారికి నిరాశ పుడుతోంది. వారి మనస్తత్వాన్ని మనమే అర్థం చేసుకోవాలని ప్రతిపక్షాలపై సీఎం యోగీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tags:    

Similar News