Syrians: స్వదేశానికి చేరుకుంటున్న సిరియన్లు.. ఐదు రోజుల్లోనే 7,600 మంది రాక
సిరియాలో సుధీర్ఘ కాలంగా జరిగిన అంతర్యుద్ధం వల్ల పిల్లలతో సహా అనేక మంది దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: సిరియా (Syria)లో సుధీర్ఘ కాలంగా జరిగిన అంతర్యుద్ధం వల్ల పిల్లలతో సహా అనేక మంది దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బషర్ అల్ అసద్ పతనం తర్వాత ఐదు రోజుల్లోనే 7600 మందికి పైగా సిరియన్లు స్వదేశానికి వచ్చారని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ (Ali Yerlikaya) తెలిపారు. వీరంతా ఘర్షణల కారణంగా వేరే దేశాలకు వలస వెళ్లారని, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక టర్కీ సరిహద్దును దాటి స్వదేశానికి చేరుకున్నారని వెల్లడించారు. ప్రతి రోజూ అనేక మంది టర్కీ నుంచి వస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు 7621 మంది తిరిగి వచ్చారని పేర్కొన్నారు. గత సోమవారం ఒక్కరోజే సిల్వెగోజు సరిహద్దు ద్వారా 1,259 మంది సిరియాలోకి ఎంటర్ అయ్యారని చెప్పారు. కాగా, 2011లో అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత సిరియా నుంచి పారిపోయిన దాదాపు మూడు మిలియన్ల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయమిచ్చినట్టు తెలుస్తోంది. అసద్ పతనంతో చాలా మంది స్వదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నారు.