Cm shinde: 100 సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం.. శివాజీ విగ్రహ ఘటనపై సీఎం షిండే

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా రాజ్ కోట్‌లో 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-08-29 17:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా రాజ్ కోట్‌లో 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై 100 సార్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అవసరమైతే మరాఠా యోధుడు శివాజీ పాదాలను తాకుతానని తెలిపారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పాలిటిక్స్ చేయడానికి చాలా సమస్యలున్నాయని, శివాజీ మహారాజ్ మనందరికీ గుర్తింపు అని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకునే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రత్యర్థులకు బుద్ధి చెప్పాలని, తద్వారా వారు రాజకీయాలను ఇష్యూలోకి తీసుకురాబోరని అన్నారు. ఇండియన్ నేవీ అధికారులు రాజ్‌కోట్ ప్రాంగణాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నాలు చేపట్టొచ్చని అభిప్రాయపడ్డారు. ఐఐటీ ఇంజినీర్లు, నేవీ అధికారులతో సమావేశమయ్యామని, కొత్త విగ్రహ ఏర్పాటుకు రెండు కమిటీలను సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అదే స్థలంలో త్వరలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను కమిటీ పరిశోధించి, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. 


Similar News