Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నాని కొలీజియం సిఫారసు చేసింది.

Update: 2024-10-17 10:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నాని కొలీజియం సిఫారసు చేసింది. తదుపరి సీజేగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్ ఖన్నా పేరుని ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (CJI DY Chandrachud) కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) నియామకం కానున్నారు. ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. తర్వాత, దాన్ని ప్రధానమంత్రి పరిశీలన కోసం న్యాయశాఖకు పంపనుంది. ప్రధాని ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. చివరగా.. రాష్ట్రపతి అనుమతితో ఆయన ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. నిబంధనల ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ జడ్జి పేరును సిఫార్సు చేస్తారు. కాగా.. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్ గా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం ఈ ఏడాది నవంబరు 11తో ముగియనుంది. నవంబరు 12న జస్టిస్‌ ఖన్నా సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు.

ఎవరీ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా?

జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో లాయర్ గా నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో ప్రాక్టీస్ కొనసాగించారు. ఖన్నా ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్ (సివిల్)అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ , అమికస్ క్యూరీగా పనిచేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి , 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడిగా ఉన్నారు. వివాదాస్పద సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను నిర్మాణాన్ని ఆమోదించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. అంతేకాదు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన బెంచ్, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన రాజ్యాంగ ధర్మాసనాల్లో సంజీవ్‌ ఖన్నా ఉన్నారు.


Similar News