CJI Chandrachud : జిల్లా న్యాయవ్యవస్థల కోసం జాతీయస్థాయి రిక్రూట్‌మెంట్ : సీజేఐ

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని జిల్లాల న్యాయవ్యవస్థల కోసం జాతీయ స్థాయిలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

Update: 2024-09-01 19:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని జిల్లాల న్యాయవ్యవస్థల కోసం జాతీయ స్థాయిలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ప్రాంతీయ, రాష్ట్రస్థాయి అడ్డు గోడలను చెరిపేసి.. జిల్లా స్థాయి న్యాయవ్యవస్థల కోసం జాతీయ స్థాయిలో భర్తీ ప్రక్రియను చేపడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సులో సీజేఐ ప్రసంగించారు. ‘‘జిల్లాస్థాయి న్యాయ వ్యవస్థల్లో ఏటా సగటున 28 శాతం జ్యుడీషియల్ సిబ్బంది, 27 శాతం నాన్ జ్యుడీషియల్ సిబ్బంది ఖాళీలు ఏర్పడుతుంటాయి. ఈ ఖాళీల భర్తీ కోసం జాతీయ స్థాయిలో ఒక సమీకృత వార్షిక జాబ్ క్యాలెండర్ ఉండాలి. ఉద్యోగం స్వభావాన్ని బట్టి దాని ఎంపిక ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను నిర్ణయించాలి. ఈ సదస్సులో మేం ప్రధానంగా ఈ అంశాలపైనే చర్చించాం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

న్యాయవ్యవస్థకు ఎంతగా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే.. అంతగా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. ‘‘రాష్ట్ర స్థాయుల్లో జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ సిబ్బందికి శిక్షణ అందించేందుకు ప్రత్యేకమైన ట్రైనింగ్ మాడ్యూల్స్‌ అందుబాటులో ఉంటాయి. అయితే వాటిని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సమీకృతం చేసేందుకు ఉద్దేశించిన శ్వేతపత్రాన్ని సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ విభాగం సిద్ధం చేస్తోంది’’ అని సీజేఐ వెల్లడించారు.


Similar News