పిల్లల రిపోర్ట్ కార్డ్.. పేరెంట్స్ విజిటింగ్ కార్డ్ కాదు- ప్రధాని మోడీ
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పేరెంట్స్, టీచర్స్ సమష్ఠిగా పరిష్కరించాలని కోరారు ప్రధాని మోడీ. విద్యార్థులను ప్రోత్సహించేందుకు పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పేరెంట్స్, టీచర్స్ సమష్ఠిగా పరిష్కరించాలని కోరారు ప్రధాని మోడీ. ఢిల్లీ ఐటీపీవోలని భారత మండపంలో పరీక్ష పే చర్చ ఏడో ఎడిషన్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ వినియోగం, తల్లిదండ్రులు- పిల్లల మధ్య సంబంధాలు సహా పలు అంశాలు ప్రస్తావించారు మోడీ. పోటీ, సవాళ్లు జీవతంలో స్ఫూర్తిగా పనిచేస్తాయన్నారు. ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని పేర్కొన్నారు. ఎవరికి వారు ఉత్తమంగా నిలిచేందుకు దృష్టి పెట్టాలని.. తోటి వారితో కాకుండా తమతో తామే పోటీపడాలని విద్యార్థులకు సూచించారు.
పిల్లలను ఇతరులతో పోల్చడం ద్వారా తల్లిదండ్రులు వారిలోని మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని తగ్గించవద్దనారు. దాని బదులుగా విద్యార్థులతో సరైన సంభాషణలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ పిల్లల రిపోర్ట్ కార్డ్ ని తమ విజిటింగ్ కార్డుగా పరిగణించవద్దని పేరెంట్స్ కు సూచించారు ప్రధాని మోడీ.
మొబైల్ వాడకం అన్నింటికన్నా చెడ్డ విషయం అన్నారు. విద్యర్థులు వారి స్క్రీన్ టైంని తగ్గించుకోవాలని సూచించారు. తాను అవసరమైనప్పుడే మొబైల్ వాడతానని తెలిపారు. మొబైల్ లో స్క్రీన్ టైం అలర్ట్ టూల్స్ ని వేసుకుని.. వాడకాన్ని తగ్గించుకునేలా ప్రయత్నించండని సూచించారు. ప్రతిదానికీ ఒక ప్రమాణం ఉండాలి..దేన్ని ఎంతవరకు ఉపయోగించాలనే విచక్షణ చాలా ముఖ్యం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండొద్దని.. దాన్ని సానుకూలంగా వాడుకోవాలని అన్నారు.
మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమన్నారు. టీచర్లు తమ వృత్తిని ఉద్యోగంగా తీసుకోవద్దని అన్నారు. విద్యార్థుల జీవితాల్లో సాధికారత సాధించే సాధనంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
తొలిరోజు నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధం తొలిరోజు నుంచే స్నేహపూర్వకంగా ఉంటే.. పరీక్షల్లో పిల్లలు ఒత్తిడికి గురికారని అన్నారు. విద్యార్థులందరినీ ఉపాధ్యాయులు సమానంగా చూడాలన్నారు.చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకుని.. క్రమంగా పూర్తి సబ్జెక్ట్ ను పూర్తి చేయాలని అన్నారు. అలా అయితేనే పరీక్షలకు పూర్తిగా సిద్ధంగా ఉంటారన్నారు.
అన్నిరకాల ఒత్తిళ్లను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉండాలని అన్నారు. ఒత్తిడి పెరుగుతూనే ఉంటుందని విశ్వసించాలని.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని సూచించారు. ఒక పాయింట్ మించి దేన్నీ సాగదీయవద్దని.. నెమ్మదిగా..కొద్ది కొద్దిగా పని పూర్తి చేయాలని అన్నారు ప్రధాని. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను మోడీ అభినందించారు.