Marital Rape : భార్యను భర్త బలవంతం చేయడాన్ని నేరంగా పరిగణించలేం : కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో : భార్యను భర్త లైంగికంగా బలవంతం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Update: 2024-10-03 15:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భార్యను భర్త లైంగికంగా బలవంతం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ దాన్ని నేరంగా పరిగణిస్తే దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, వివాహ వ్యవస్థలో అవాంతరాలు ఏర్పడుతాయని తెలిపింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ద్వారా తన స్పందనను తెలియజేసింది. భార్యను భర్త లైంగికంగా బలవంతం చేసే అంశాలపై ఇప్పటికే తగిన శిక్షలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ‘‘పెళ్లి చేసుకోవడం వల్ల మహిళ ‘సమ్మతి’ తొలగిపోయినట్లు కాదు. దాన్ని ఉల్లంఘిస్తే తగువిధంగా చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. వివాహిత సమ్మతిని రక్షించే చట్టపరమైన పరిష్కార మార్గాలను పార్లమెంటు అందించింది. మహిళ స్వేచ్ఛ, గౌరవం, హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.

ఇది సామాజిక సమస్య..

ఇది చట్టబద్ధమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని చెప్పింది. ఇలాంటి అంశాలపై తీసుకునే నిర్ణయాల వల్ల సమాజంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని, వీటిపై నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత పక్షాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర సర్కారు సూచించింది. ‘‘భార్యను భర్త లైంగికంగా బలవంతం చేయడాన్ని అత్యాచార నేరంగా పరిగణించే అంశం కోర్టు పరిధిలోకి రాదు. దీనిపై చట్టసభలే నిర్ణయం తీసుకోవాలి. ఈక్రమంలో అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ప్రభుత్వం తెలిపింది. ‘‘భార్యాభర్తల దాంపత్య జీవితంలో చాలా అంశాలు భాగంగా ఉంటాయి. లైంగిక కలయిక అనేది వాటిలో ఒక అంశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది.

ఏమిటీ పిటిషన్ .. ?

గతంలో ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భార్యను భర్త లైంగికంగా బలవంతం చేస్తే ఎలా పరిగణించాలనే దానిపై ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అయితే ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు(జస్టిస్ రాజీవ్ శాఖ్దర్, జస్టిస్ సి.హరి శంకర్) రెండు భిన్నమైన తీర్పులను వెలువరించారు. భార్యను భర్త లైంగికంగా బలవంతం చేసినా అతడిపై అభియోగాలను మోపరాదనే ఐపీసీ నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమైందని జస్టిస్ రాజీవ్ శాఖ్దర్ అన్నారు. జస్టిస్ సి.హరి శంకర్ మాత్రం ఆ ఐపీసీ నిబంధనను సమర్ధించారు. ఈ తీర్పుపై దాఖలైన అప్పీల్ పిటిషన్‌నే ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది.


Similar News