Supreme Court: వైవాహిక అత్యాచారాలను నేరంగా భావించలేం: కేంద్రం
వివాహానికి సంబంధించి మేజర్ అయిన భార్యను లైంగికంగా బలవంతం చేసినప్పటికీ అత్యాచారంగా పరిగణించలేమని వివరించింది.
దిశ, నేషనల్ బ్యూరో: వైవాహిక అత్యాచారాలను నేరంగా భావించడాన్ని వ్యతిరేకిస్తూ, అత్యాచారంపై ప్రస్తుతం ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని దాఖలైన పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్రం సుప్రీంకోర్టుకు అందజేసిన ప్రతిస్పందనలో.. వివాహానికి సంబంధించి మేజర్ అయిన భార్యను లైంగికంగా బలవంతం చేసినప్పటికీ అత్యాచారంగా పరిగణించలేమని వివరించింది. మేజర్ అయిన భార్యను బలవంతం చేసే అంశాన్ని అత్యాచారంగా పరిగణిస్తే దాంపత్యంపై ప్రభావం ఉంటుందని, అది వివాహ వ్యవస్థలో సమస్యలకు కారణం అవ్వొచ్చని అభిప్రాయపడింది. అలాగే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భావించే అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు అన్ని పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ లేకుండా దీనిపై నిర్ణయం కుదరదని వివరించింది. ఇదే సమయంలో తన భార్యను ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతం చేసేందుకు కూడా భర్తకు అర్హత లేదని స్పష్టం చేసింది. దానికోసం చట్టంలో శిక్షలు అమల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మహిళల స్వేచ్ఛ, గౌరవం, హక్కుల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది చట్టబద్ధమైన దానికంటే సామాజికపరమైన సమస్య అని, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా అన్ని ప్రక్షాలతో చర్చలు జరపాలని పేర్కొంది.