రాష్ట్రాలకు రూ.1.39 లక్షల కోట్లు.. మోడీ గుడ్ న్యూస్
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర క్యాబినెట్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్ను వాటాకు సంబంధించి జూన్ నెలకుగానూ రూ.1,39,750 కోట్ల విడుదలకు సోమవారం పచ్చజెండా ఊపింది. దీనికి అదనంగా మరో నెల రోజుల పన్ను వాటాను రాష్ట్రాలకు అడ్వాన్సుగా చెల్లించాలని మోడీ క్యాబినెట్ నిర్ణయించింది. 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్ను వాటా కింద రూ.12,19,783 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తాజాగా జూన్ నెలలో నిధుల విడుదలతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు కేంద్రం అందించిన పన్ను వాటా నిధుల మొత్తం రూ.2,79,500 కోట్లకు చేరింది. ఈవివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి, మూలధన వ్యయాన్ని పెంచడానికి దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు అందిస్తారు. అయితే ఈ మొత్తాన్ని మొత్తం ఆర్థిక సంవత్సరం వ్యవధిలో 14 విడతల్లో రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంటారు.