Kolkata Rape-Murder Case: సీబీఐ విచారణలో ఇద్దరు మహిళా అధికారులు

కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను సీబీఐకి చెందిన ఇద్దరు కీలక మహిళా ఆఫీసర్లకు అప్పగించారు.

Update: 2024-08-20 06:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనను సీబీఐకి చెందిన ఇద్దరు కీలక మహిళా ఆఫీసర్లకు అప్పగించారు. ఇంతకుముందు హత్రాస్, ఉన్నావో లాంటి సంచలనాత్మక కేసుల్లో దర్యాప్తు సాధించిన అధికారులు ఈ కేసు విచారణ చేపట్టారు. జార్ఖండ్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంపత్ మీనా కోల్ కతా అత్యాచారం, హత్య కేసు నిర్వహించనున్నారు. ఆమెతోపాటు హత్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా పహుజా కూడా ఈ కేసులో భాగం కానున్నారు. మీనా సీబీఐ అదనపు డైరెక్టర్. ఇప్పుడు 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. ఈకేసుని సంపత్ మీనా పర్యవేక్షిస్తారు. 2007 నుంచి 2018 కాలంలో పలు కేసుల్లో అద్భుతమైన విచారణ చేపట్టడంతో రెండుసార్లు గోల్డ్ మెడల్ అందుకున్నారు.

క్షేత్రస్థాయి విచారణ చేయనున్న సీమా పహుజా

కోల్ కతా అత్యాచారం, హత్య కేసులో మరో అధికారి సీమా పహుజా కూడా భాగంకానున్నారు. కోల్ కతా ఘటనలో సీమా పహుజా క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ అయిన సీమా కుటుంబ బాధ్యతల దృష్ట్యా ఒక్కసారి వీఆర్‌ఎస్‌ తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పటి సీబీఐ డైరెక్టర్‌ ఆమెను ఒప్పించగా.. ఆ ఆలోచనను విరమించున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థిని అత్యాచారం-హత్య జరిగింది. ఆ బ్లైండ్ కేసుని ఛేదించడంతో సీమా పహుజా పేరు మార్మోగిపోయింది. కాగా.. ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళా అధికారులు కోల్ కతా కేసు దర్యాప్తు కొనసాగుతున్నారు.


Similar News