రాజకీయాల్లోనూ కాస్టింగ్ కౌచ్.. సంచలన ప్రకటన చేసిన నాయకురాలు

ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం రేగుతోంది.

Update: 2024-09-01 14:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ దుమారం రేగుతోంది. జస్టిస్ హేమ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేశాక.. ఒక్కొక్కరుగా తమకు జరిగిన లైంగిక హింసను బయట పెడుతున్నారు. అలాగే తెలుగు, తమిళ పరిశ్రమల్లోనూ మహిళా నటుల హక్కుల పరిరక్షణకు, వారిపై జరుగుతున్న హింసను అడ్డుకోవడానికి కమిటీలు వేయాలని పలువురు ప్రముఖ నటీమణులు తమ గళం విప్పుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కేరళకు చెందిన ఓ ముఖ్య నాయకురాలు తాజాగా బాంబు పేల్చింది. కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు రోజ్ బెల్ జాన్.. రాజకీయాల్లోనూ కాస్టింగ్ కౌచ్ లాంటిది ఉందని ఆరోపణలు చేసింది. పార్టీలో చాలామంది పురుష నాయకుల నుండి మహిళా నేతలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారని, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు బయట పెడతానని రోజ్ అన్నారు. అంతే కాదు నాయకులతో సన్నిహితంగా ఉన్నవారికే పదవులు వస్తాయని, ప్రస్తుతం కొంతమంది అలాగే పదవులు పొందారని అన్నారు. అయితే రోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేరళ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. రోజ్ వ్యాఖ్యలు ఖండిస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా తీసుకు వెళ్ళినట్టు సమాచారం.    


Similar News