సింపుల్ ఇంగ్లీష్ చదవట్లేదు..లెక్కలు రావడం లేదు: గ్రామీణ ప్రాంతాల్లో విద్యా పరిస్థితిపై ‘అసర్’ నివేదిక

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ ప్రాంతాల్లోని స్టూడెంట్స్ దాదాపు 42శాతం మంది సులభమైన ఇంగ్లీష్ చదవలేక పోతున్నారు.

Update: 2024-01-18 04:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ ప్రాంతాల్లోని స్టూడెంట్స్ 14-18 మధ్య వయసున్న వారు దాదాపు 42శాతం మంది సులభమైన ఇంగ్లీష్ చదవలేక పోతున్నారు. అంతేగాక లెక్కలు చేయడంలోనూ ఇబ్బంది పడుతున్నారు. వార్షిక విద్యా స్థితి నివేదిక (అసర్) నివేదికలోఈ విషయం వెల్లడైంది. ‘బియాండ్ బేసిక్స్’ 2023 పేరుతో ప్రథమ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 14-18 మధ్య ఉన్న పిల్లలు దాదాపు 25 శాతం మంది తమ మాతృభాషలో క్లాస్ 2 స్థాయి పాఠ్యాంశాలను చదవలేక పోతున్నారని నివేదిక పేర్కొంది. అంతేగాక సగానికి పైగా విద్యార్థులు 3 అంకెల భాగహార లెక్కలు చేయలేకపోతున్నారని తెలిపింది. 57.3శాతం మంది ఇంగ్లీష్ చదవగలినప్పటికీ వారిలో మూడు వంతు స్టూడెంట్స్ మాత్రమే వాటి అర్థాలు చెప్పగలుగుతున్నట్టు స్పష్టం చేసింది. ప్రాంతీయ భాషల్లో క్లాస్ 2 పాఠ్యాంశాలను చదవడంలో బాలుర (70.9శాతం) కంటే, బాలికలు (76 శాతం) మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. అయితే గణితం, ఆంగ్లం చదవడంలో బాలురు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. బాగాహారానికి సంబంధించిన లెక్కలు చేయడంలో సగానికి పైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొంది.

28జిల్లాల్లో సర్వే

మొత్తం 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో సర్వే నిర్వహించగా, 14-18 మధ్య వయసున్న 3 4,745 మంది పాల్గొన్నారు. ప్రతి ప్రధాన రాష్ట్రంలోని ఒక గ్రామీణ జిల్లాలో సర్వే చేపట్టగా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో మాత్రం రెండు జిల్లాల్లోనే చేశారు. కాగా, అసర్ అనేది గ్రామీణ భారతదేశంలోని పిల్లలు, విద్యా పరిస్థితి, అభ్యసనా సామర్థ్యాలపై అధ్యయనం చేస్తుంది. 

Tags:    

Similar News