Cag: కాగ్ నియామక ప్రక్రియపై పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
కాగ్ నియామకానికి సంబంధించిన నియమాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది.

దిశ, నేషనల్ బ్యూరో: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నియామకానికి సంబంధించిన నియమాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు (Supreme court) కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్ (Surya kanth), ఎన్ కోటీశ్వర్ సింగ్ (Kotishwar singh)లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాగ్ స్వతంత్రతను కోల్పోయిందని, కాబట్టి నియామక ప్రక్రియ స్వేచ్చగా, పారదర్శకంగా ఉండాలని, ఈ ప్రక్రియలో సీజేఐని కూడా చేర్చాలని సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashanth bhushan) వాదనలు వినిపించారు. కాగ్ స్వతంత్రతను కోల్పోయిందని, ఈ నియామకాన్ని ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాగ్ ఆడిట్‌లను అడ్డుకుంటున్నారని తెలిపారు.
ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీతో సంప్రదించి, పారదర్శకంగా కాగ్‌ను నియమించేలా రాష్ట్రపతిని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న బెంచ్ రాజ్యాంగం నియామకాలకు అపరిమిత అధికారాన్ని అందించినప్పుడు, కోర్టు ఎంత వరకు జోక్యం చేసుకుని దానిని తిరిగి వ్రాయగలదని ప్రశ్నించింది. ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాల్సి రావొచ్చని పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను దీనికి అటాచ్ చేసింది.