Waqf bill: వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడి.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభివర్ణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf amendment bill) రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jai ram Ramesh) అభివర్ణించారు. ఎంతో కాలంగా నెలకొన్న సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు వ్యూహంలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేసి మైనారిటీ వర్గాలను కించపర్చడానికి కాషాయ పార్టీ నిరంతరం ప్రయత్నిస్తోందన్నారు. ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024 పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ సమాన హక్కులు, రక్షణకు హామీ ఇచ్చే రాజ్యాంగ నిబంధనలను బలహీనపర్చడమే లక్ష్యంగా ఉంది’ అని ఆరోపించారు. పాత చట్టాల ప్రకారం వక్ఫ్ నిర్వహణకు సృష్టించబడిన అన్ని సంస్థల స్థితి, నిర్మాణం, అధికారాన్ని తగ్గించడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోందన్నారు.
వక్ఫ్ ప్రయోజనాలకు తన భూమిని ఎవరు దానం చేయొచ్చో నిర్ణయించడంలో ఉద్దేశపూర్వకంగా అస్పష్టత తీసుకొచ్చారని దీని కారణంగా వక్ఫ్ నిర్వచనమే మారిపోయిందన్నారు. వక్ఫ్ పరిపాలనను బలహీనపరిచేందుకు, ప్రస్తుత చట్టంలోని నిబంధనలను ఎటువంటి కారణం లేకుండా తొలగిస్తున్నారని, అంతేగాక వక్ఫ్ భూములను ఆక్రమించే వారిని రక్షించడానికి చట్టంలో ఇప్పుడు మరిన్ని రక్షణలు ప్రవేశపెట్టబడుతున్నాయని నొక్కి చెప్పారు. 428 పేజీల నివేదికను జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో ఎటువంటి వివరణాత్మక చర్చ లేకుండా బలవంతంగా ఆమోదించారని, ఇది పార్లమెంటరీ పద్దతులను ఉపయోగించడమేనని తెలిపారు.