Heart attack: మార్నింగ్ వాక్‌కు వెళ్లగా హార్ట్ ఎటాక్.. అక్కడికక్కడే కూలిపోయిన ఆర్ఎల్‌డీ నేత
ఇటీవల కాలంలో అనేక మంది యువకులు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయే ఘటనలు తరచూ వెలుగు చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో అనేక మంది యువకులు అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయే ఘటనలు తరచూ వెలుగు చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ (Bulandh Shahar) జిల్లాలోనూ ఈ తరహా విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు బయలుదేరిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) కార్యకర్త గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ పుటేజీలో రికార్డైంది. మదన్ పూర్ గ్రామానికి చెందిన అమిత్ చౌదరి (28) అనే వ్యక్తి మార్నింగ్ వాక్ నిమిత్తం తన ఇంటి నుంచి బయలు దేరాడు. ఈ క్రమంలోనే ఇంటికి సమీపంలో అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే కూలిపోయాడు.
కింద పడిపోయే ముందు పక్కనే ఉన్న ఓ గోడ సహాయం తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సెకన్లలోనే స్పృహ కోల్పోయాడు. గమనించిన కొందరు వ్యక్తులు ఆయనకు సాయం అందించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే అమిత్ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిత్ ఆకస్మిక మరణం పట్ల ఆర్‌ఎల్‌డీ విచారం వ్యక్తం చేసింది. ఆయన పార్టీలో ఎంతో చురుకుగా వ్యవహరించేవారి, ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది.