Cabinet: అసోంలో కొత్త యూరియా ప్లాంట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) వెల్లడించారు. రూ.16000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాల ఉత్పత్తిని, దేశీయ పశు జాతుల ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్కీమ్ (Gokul mission scheme) కింద రూ.3,400 కోట్లు కేటాయించింది. అంతేగాక దేశ వ్యాప్తంగా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమానికి (NPDD) రూ.2790 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదించింది.
కొత్త యూరియా ప్లాంట్
అసోంలోని నమ్రూప్‌లో రూ.10,601 కోట్ల పెట్టుబడితో కొత్త బ్రౌన్‌ఫీల్డ్ అమ్మోనియా-యూరియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (BVFCL) నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఈశాన్య ప్రాంతంలోని రైతులకు సకాలంలో ఎరువులను అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్ట్ 48 నెలల్లో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం వల్ల ఈశాన్య రాష్ట్రాలే గాక, పశ్చిమ బెంగాల్ (West Bengal) సైతం ప్రయోజనం పొందుతుంది.
డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి చర్యలు
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ను ప్రోత్సహించడానికి ప్రోత్సాహక పథకం (P2M)ను ఏడాది పాటు పొడిగించారు. ఈ పథకం 2026 మార్చి 31 వరకు కొనసాగనుంది. దీనికోసం రూ.1500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద చిన్న దుకాణదారులు రూపే డెబిట్ కార్డ్, బీమ్‌యూపీఐ ద్వారా వ్యక్తి నుంచి వ్యాపారికి రూ. 2,000 వరకు లావాదేవీలపై 0.15శాతం ప్రోత్సాహకం పొందుతారు. దీని వల్ల చిన్న వ్యాపారులకు లాభం చేకూరనుంది.
మహారాష్ట్రలో హైస్పీడ్ హైవే
మహారాష్ట్రలోని జెఎన్‌పీఎ పోర్ట్ (పగోట్) నుంచి చౌక్ వరకు ఆరు లేన్ల హై-స్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం లభించింది. 29.219 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డును బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) మోడల్ కింద చేపట్టనుండగా ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.4,500 కోట్లు కేటాయించనున్నారు. ఈ రోడ్డు ముంబై సమీపంలో ఉన్న జేఎన్‌పీఏ పోర్టు, త్వరలో ప్రారంభించబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.