మేనకాగాంధీ ఆరోపణలను ఖండించిన 'ఇస్కాన్'..

Update: 2023-09-27 16:21 GMT

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) సంస్థది దేశంలోనే అతిపెద్ద మోసమని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ అన్నారు. గోశాలల నుంచి ఆవులను కసాయిలకు విక్రయిస్తోందని ఆమె ఒక వీడియోలో ఆరోపించారు. అంతేకాదు ఇస్కాన్ గోశాలలను నిర్వహిస్తూ, విస్తారమైన భూములు సహా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందుతుందని వ్యాఖ్యానించారు. సదరు వీడియోలో మతపరమైన సంస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మేనకా గాంధీ.. ‘నేను ఇటీవలే అనంతపురంలోని గోశాలను సందర్శించాను. అక్కడ ఒక్క ఆవు కూడా మంచి స్థితిలో కనిపించలేదు. దూడలు లేనే లేవు, అంటే అవన్నీ అమ్ముడయ్యాయి’ అని ఆరోపించారు.

కాగా.. అవన్నీ తప్పుడు ఆరోపణలు, నిరాధారమైనవని ఇస్కాన్ తోసిపుచ్చింది. మాజీ కేంద్ర మంత్రి ప్రకటన పట్ల తాము ఆశ్చర్యపోయామని పేర్కొంది. గొడ్డు మాంసం ప్రధాన ఆహారంగా ఉన్న ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణకు ఇస్కాన్ మార్గదర్శకత్వం వహించిందని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిస్తీర్ గోవింద దాస్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇస్కాన్ గోశాలలోని చాలా ఆవులను వదిలివేసినవి లేదా గాయపడినవి లేదా వధ నుంచి రక్షించి తర్వాత తమ వద్దకు తీసుకొచ్చనవని ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News