రాజస్థాన్‌లో రణరంగం.. సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ యత్నం

రాజస్థాన్‌లో బీజేపీ మంగళవారం చేపట్టిన 'చలో సెక్రటేరియట్' రణరంగంగా మారింది.

Update: 2023-08-01 16:20 GMT

జైపూర్: రాజస్థాన్‌లో బీజేపీ మంగళవారం చేపట్టిన 'చలో సెక్రటేరియట్' రణరంగంగా మారింది. సచివాలయం వైపు దూసుకొస్తున్న బీజేపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష పేపర్ లీక్‌లు, మహిళలపై నేరాలు, రైతుల కష్టాలు, అవినీతి సహా పలు సమస్యలపై అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ర్యాలీగా వెళ్లిన వేలాది మంది బీజేపీ కార్యకర్తలు బారికేడ్లను తొలగించి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టేసి ముందుకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. బీజేపీ ‘నహీ సహేగా రాజస్థాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ మార్చ్‌లో అన్ని జిల్లాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష మంది కార్యకర్తలతో సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ ప్లాన్‌ను భారీగా మోహరించిన పోలీసులు సమర్ధవంతంగా అడ్డుకున్నారు. పలువురు బీజేపీ సీనియర్ నేతలను అదుపులోకి తీసుకొని తర్వాత వదిలేశారు.


Similar News