రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో కూలిపోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం!
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక, ఉత్తరప్రదేశ్(యూపీ), హిమాచల్ ప్రదేశ్‌లలో కలిపి 15 రాజ్యసభ సీట్లకు మంగళవారం ఓటింగ్ నిర్వహించారు. హైడ్రామా మధ్య సాగిన ఈ పోలింగ్‌లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌తో తమ తమ పార్టీలకు ఝలక్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. కాంగ్రెస్‌కు ఉన్న 40 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు క్రాస్ ఓటింగ్ వేశారు. వీరితోపాటు మరో ముగ్గురు స్వతంత్రులు సైతం బీజేపీకే అనుకూలంగా ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీపై బీజేపీ అభ్యర్థి హర్షమహాజన్ గెలుపొందారు. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో.. అధికార కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్రులు ఉన్నారు. ముగ్గురు స్వతంత్రులతోపాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో ఇద్దరు అభ్యర్థులకు 34 చొప్పున ఓట్లు పడటంతో లాట్స్ డ్రా ద్వారా ఫలితాలను ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలిచినట్టు అధికారులు వెల్లడించారు. క్రాస్ ఓటింగ్ వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 34కు పడిపోయే అవకాశం ఉంది. మరో ఎమ్మెల్యేలను లాక్కుని స్వతంత్రులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరగగా, బీజేపీకి చెందిన 8మంది, సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ)కి చెందిన ఇద్దరు విజయం సాధించారు. ఎస్పీ ముగ్గుర్ని బరిలోకి దింపగా, ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేయడంతో ఒక స్థానంలో ఓడిపోయింది.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు అనుకూలంగా..
హిమాచల్ ప్రదేశ్, యూపీలో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రాగా, కర్ణాటకలో మాత్రం బీజేపీ-జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగ్గా, మూడు చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో జేడీఎస్ అభ్యర్థి ఓడిపోయారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటేయగా, మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందింది.