అరుణాచల్‌లో కమల వికాసం.. సిక్కింలో ఎస్‌కేఎం విజయనాదం

దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి.

Update: 2024-06-02 18:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగానూ 46 చోట్ల కమలదళం గెలిచింది. దీంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి అవకాశం లభించింది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే అరుణాచల్ ప్రదేశ్‌లో 10 మంది బీజేపీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. వారిలో అరుణాచల్​ ​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు. మిగతా 50 స్థానాలకు ఎన్నిక నిర్వహించగా.. 36 స్థానాల్లో బీజేపీ నెగ్గింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్​సీపీ మూడు స్థానాలు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. అరుణాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల ఫలితాలు జూన్‌ 4నే విడుదలవుతాయని ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. జూన్ 2 (ఆదివారం)తో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో.. కౌంటింగ్​ను షెడ్యూల్ చేసిన తేదీ కంటే రెండు రోజులు ముందుకు జరిపారు.

రెండు చోట్ల గెలిచిన ఎస్​కేెఎమ్ చీఫ్

సిక్కింలో అధికార సిక్కిం క్రాంతి కారీ మోర్చా (ఎస్​కేఎమ్)​ పార్టీ మరోసారి విజయఢంకా మోగించింది. ప్రేమ్​ సింగ్ తమాంగ్​ నేతృత్వంలోని ఎస్​కేెఎమ్​, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లను సొంతం చేసుకుంది. మొత్తం 32 స్థానాలకుగానూ 31 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్​ ఫిగర్​ 17ను దాటింది. రెనాక్​ స్థానం నుంచి ప్రేమ్​ సింగ్ తమాంగ్ 7000 ఓట్లకుపైగా తేడాతో గెలిచారు. తాను పోటీ చేసిన మరో నియోజకవర్గం సోరెంగ్ చకుంగ్​లోనూ తమాంగ్​ విజయం సాధించారు. ఇక సిక్కిం మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్‌డీఎఫ్)​ అధినేత పవన్​ కుమార్​ చామ్లింగ్​ ఓడిపోయారు. ఎస్‌కేఎం ​ అభ్యర్థి భోజ్​రాజ్ రాయ్​ చేతిలో ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ​ రాయ్‌కు 8,037 ఓట్లు రాగా, చామ్లింగ్‌కు 4,974 ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన మరో స్థానంలోనూ పవన్​ కుమార్ ఓటమిపాలయ్యారు. ఎస్​డీఎఫ్​ తరఫున పోటీ చేసిన భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా బార్‌ఫుంగ్ అసెంబ్లీ స్థానంలో ఎస్‌కేఎం అభ్యర్థి రిక్సాల్ దోర్జీ భూటియా చేతిలో ఓడిపోయారు. 2019 వరకు అప్రతిహతంగా 25 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​తో పాటు ఇతర పార్టీలు హమ్​రో సిక్కిం పార్టీ, సిక్కిం రాజ్య మంచ్, సిక్కిం యునైటెడ్​ ఫ్రంట్,​ జై మహా భారత్​ పార్టీ ఖాతా తెరువలేకపోయాయి.


Similar News