Kejriwal: ఆ ప్రకటనంతా ఓ పీఆర్ స్టంట్.. కేజ్రీవాల్ పై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనను బీజేపీ ఎగతాళి చేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితులను కాషాయ పార్టీ వివరించింది.

Update: 2024-09-15 10:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనను బీజేపీ ఎగతాళి చేసింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితులను కాషాయ పార్టీ వివరించింది. బెయిల్ షరతులు కఠినంగా ఉన్నాయని, కేజ్రీవాల్ విడుదలను విజయంగా చూడవద్దంది. ఆప్ ఎలాంటి అకాల వేడుకలను జరుపుకోవద్దని ఢిల్లీ బీజేపీ ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చింది. కేజ్రీవాల్ ప్రకటన అంతా పీఆర్ స్టంట్ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ఢిల్లీ వాసుల్లో నిజాయితీ గల నాయకుడి నుంచి అవినీతిపరుడిగా తన ఇమేజ్ మారినట్లు కేజ్రీవాల్ గుర్తించారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు దేశవ్యాప్తంగా అవినీతి పార్టీగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ చర్య తన ఇమేజ్‌ని పునరుద్ధరించే ప్రయత్నమని పేర్కొన్నారు. దీనిని "సోనియా గాంధీ మోడల్"తో పోల్చారు. సోనియా తెరవెనుక నుండి ప్రభుత్వాన్ని నియంత్రించినట్లే కేజ్రీవాల్ కూడా చేయాలనుకుంటున్నారని అన్నారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామని ఆప్ భయపడుతోందని, మరొకరిని బలిపశువుగా చేసి నిందించేందుకు రెడీ అవుతోందని ఆరోపించారు.

భార్యకు సీఎం పదవి?

మరో బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ రాజీనామా చేయడం త్యాగం కాదని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. కేజ్రీవాల్‌కు రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని సిర్సా నొక్కిచెప్పారు. తన భార్యను తదుపరి సీఎంగా నియమించాలని.. ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు కేజ్రీవాల్ రెండు రోజుల వ్యవధిని వాడుకుంటున్నారని ఆరోపించారు. “అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ఎత్తుగడలో మాస్టర్. తాను జైల్లో ఉన్నప్పుడు ఆ 5 నెలల్లోనే రాజీనామా చేసి ఉండాల్సింది. సానుభూతి పొందాలంటే ఇదే మార్గం అని ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు అతని వాస్తవికతను పూర్తిగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నా” అని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ అన్నారు.

కేజ్రీవాల్‌ రాజీనామా ఓ జిమ్మిక్‌

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా ప్రకటన కేవలం ఓ జిమ్మిక్ అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ కొట్టిపారేశారు. కేజ్రీవాల్ చాలా కాలం క్రితమే రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు. “ఆయన మళ్లీ సీఎం అయ్యే ప్రశ్నే లేదు” అని పేర్కొన్నారు. ఒక సీఎం బెయిల్ పై విడుదల కావడం ఇదే తొలిసారని అన్నారు. సీఎంవో తిరిగి వెళ్లొద్దని.. అధికారిక పత్రాలపై సంతకం చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశఇంచిందని విమర్శించారు. కేజ్రీవాల్ సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అని కోర్టు ఆందోళనపడుతోందని.. తనను ఓ నేరస్థుడిలా చూస్తోందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో నైతికతకు, కేజ్రీవాల్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెప్టెంబర్ 13న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈకేసులో ఏప్రిల్ 1 నుంచి జైలులో ఉన్న ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.


Similar News