బలమైన ప్రభుత్వంతోనే అది సాధ్యమైంది : ప్రధాని మోడీ

కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండబట్టే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటులో సులువుగా ఆమోదం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Update: 2023-09-22 14:58 GMT

న్యూఢిల్లీ : కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండబట్టే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంటులో సులువుగా ఆమోదం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇది సాధారణ చట్టం కాదని.. నవ భారత ప్రజాస్వామ్య నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించిన సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని మోడీకి సత్కార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహిళా నేతలకు వినమ్రంగా నమస్కరించారు. ప్రధాని మాట్లాడుతూ.. గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ల అంశం గత మూడు దశాబ్దాలుగా నానుతూ వచ్చిందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండటం వల్లే.. గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతులను చింపేసిన రాజకీయ పార్టీలే మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. పూర్తి మెజారిటీ ఉన్న బలమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైందని మోడీ స్పష్టం చేశారు.


Similar News