Hurricane Milton: అమెరికాను వణికిస్తున్న హరికేన్ మిల్టన్.. ఫ్లోరిడా రాష్ట్రంపై తీవ్ర ప్రభావం

అమెరికాలో హరికేన్ మిల్టన్ ఆందోళనకు గురిచేస్తోంది. మిల్టన్ దెబ్బకు ఫ్లోరిడా నగరం అతలాకుతలం అవుతోంది.

Update: 2024-10-10 05:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో హరికేన్ మిల్టన్ ఆందోళనకు గురిచేస్తోంది. మిల్టన్ దెబ్బకు ఫ్లోరిడా నగరం అతలాకుతలం అవుతోంది. ఈ తుపాన్ గురువారం ఉదయం ఫ్లోరిడా రాష్ట్రంలోని సియస్టా కీ నగర తీరాన్ని తాకింది. దీని కారణంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. అంతేగాక భారీగా వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. సియస్టా కీని తాకడానికి ముందు మిల్టన్ కేటగిరీ 5 హరికేన్ ఉండగా.. సియాస్థి తీరంలోకి ప్రవేశించాక ఇది కేటగిరీ 3గా మారింది. ఫ్లోరిడాలోని పలు నగరాల్లో గంటకు 193 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని వల్ల సుమారు ఒక మిలియన్ మంది ప్రజలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 20 లక్షల మందికిపైగా వరద ముప్పు పొంచి ఉందచి స్థానిక అధికారులు హెచ్చరించారు. ఫ్లోరిడాలోని అనేక నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం

మిల్టన్ తుపాను కారణంగా సముద్రంలో 8 నుంచి 12 అడుగుల ఎత్తు లేదా 2.4 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో తుపాను అలలు ఎగసిపడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. హై అలర్ట్ నేపథ్యంలో ఫ్లోరిడాలోని గల్ఫ్ కోస్ట్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఫ్లోరిడాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యల నిమిత్తం అక్కడ భారీగా రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. మరోవైపు హరికేన్ మిల్టన్ వల్ల ఫ్లోరిడా రాష్ట్రంలో భారీ ఆస్తినష్టం జరినట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. హరికేన్ తీరానికి రాకముందే దాదాపు 125 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. 


Similar News