బీజేపీకి మేలు చేసేందుకే గోవా ఎన్నికల్లో భారీగా ఖర్చు.. తృణమూల్ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

రాబోయే ఎన్నికల్లో తామే మెజార్టీ సాధిస్తామని.. కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన రోజే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్‌పై (టీఎంసీ) సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-02-22 16:37 GMT

షిల్లాంగ్: రాబోయే ఎన్నికల్లో తామే మెజార్టీ సాధిస్తామని.. కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన రోజే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తృణమూల్ కాంగ్రెస్‌పై (టీఎంసీ) సంచలన ఆరోపణలు చేశారు. హింస, కుంభకోణాలే టీఎంసీ సంప్రదాయమన్నారు. షిల్లాంగ్‌ ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కష్టపడుతోందని ఆరోపించారు.

ర్యాలీ సందర్భంగా తాను ధరించిన జాకెట్‌ను చూపిస్తూ.. 'మేఘాలయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవ సూచకంగా దీనిని నేను ధరించాను. నా ఆలోచనలు, చర్యలను ఈ జాకెట్ ప్రతిబింబిస్తుంది. కానీ నేను ప్రధాన మంత్రిలా ఇక్కడికి వస్తే మీ మతం, సంస్కృతి, చరిత్రలను అవమానించినవాడినవుతాను' అని రాహుల్ అన్నారు. ఇదే సందర్భంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను, కుంభకోణాలను ప్రస్తావించారు.

'తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర మీకు తెలుసా..? పశ్చిమ బెంగాల్‌లో హింస, కుంభకోణాలు వారి సంప్రదాయాలు. గోవా ఎన్నికల్లో టీఎంసీ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. ఈ ఆలోచన బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పుడు మేఘాలయలోనూ అదే వైఖరి అవలంభిస్తోంది. మేఘాలయలో బీజేపీని బలోపేతం చేయడానికి, అధికారంలోకి తేవడానికి టీఎంసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది' అని రాహుల్ ఆరోపించారు.

మరోవైపు తమకు అన్నీ తెలుసన్న గర్వంతో బీజేపీ ఎవ్వరినీ గౌరవించదని, క్లాస్ రౌడీ లాంటిదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లపై సమిష్టిగా పోరాడాలని మేఘాలయ ప్రజలకు రాహుల్ పిలుపునిచ్చారు. మేఘాలయలో కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని ఎండీఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని రాహుల్ అన్నారు. మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని కలిగించాలని బీజేపీ భావిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోబోదని రాహుల్ హెచ్చరించారు.

Also Read..

వంద మంది మోడీలు రానివ్వండి.. మాదే అధికారం : మల్లికార్జున్ ఖర్గే 

Tags:    

Similar News