BJP Manifesto : కశ్మీర్ పోల్స్‌కు బీజేపీ మేనిఫెస్టో.. కీలక హామీలివీ

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం 25 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది.

Update: 2024-09-06 13:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం 25 పాయింట్లతో కూడిన మేనిఫెస్టోను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, ఇతర సీనియర్ నాయకులు కలిసి మేనిఫెస్టో ప్రతిని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగిస్తూ.. ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే జమ్మూకశ్మీర్ అంశానికి బీజేపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రాంతం భారత్‌లోనే ఉండాలనేది మా అభిమతం. అందుకు అనుగుణంగానే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ముందుకుసాగుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘పండిట్ ప్రేమ్‌నాథ్ డోగ్రా నుంచి మొదలుకొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ దాకా ఎంతోమంది యోధులు కశ్మీర్ కోసం పోరాడారు. నాటి జనసంఘ్ నుంచి మొదలుకొని నేటి బీజేపీ దాకా కశ్మీర్ కోసం సాగించిన ఉద్యమం అనన్య సామాన్యం’’ అని అమిత్‌షా గుర్తు చేశారు. 

ఆర్టికల్ 370 ఇక చరిత్రే

‘‘2014 దాకా కశ్మీర్‌లో అశాంతిని రగిల్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు నిరంతరాయం పనిచేశాయి.. ఎన్డీయే సర్కారు వచ్చినప్పటి నుంచి గత పదేళ్లుగా వాటి ఆటకట్టయింది’’ అని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ చరిత్రలో 2014 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్యకాలాన్ని సువర్ణాక్షరాలతో లిఖిస్తారని కేంద్ర హోంమంత్రి చెప్పారు. కేంద్రంలో విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఓ వర్గం వారిని ప్రసన్నం చేసుకునేందుకే పాకులాడాయని ఆయన మండిపడ్డారు. ‘‘ఆర్టికల్ 370 వల్ల కశ్మీరీల చేతుల్లోకి రాళ్లు, ఆయుధాలు వచ్చాయి. అందుకే మేం దాన్ని తొలగించాం. ఇక అది చరిత్రే. మళ్లీ అది అమలయ్యే అవకాశమే లేదు. మేం అలా జరగనివ్వం’’ అని అమిత్‌షా స్పష్టం చేశారు. కశ్మీరీల భద్రతకు భరోసా ఇస్తామని, కశ్మీర్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా పారదోలుతామని ఆయన తేల్చి చెప్పారు.

మేనిఫెస్టోలోని ముఖ్య హామీలివీ..

కశ్మీర్‌లో బీజేపీ గెలిస్తే.. ‘మా సమ్మాన్ యోజన’ స్కీంను అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబంలోని పెద్ద వయస్కులైన మహిళలకు ఏటా రూ.18వేలు చొప్పున ఆర్థికసాయాన్ని అందించనున్నారు. ఉజ్వల స్కీం ద్వారా ఏటా 2 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు. ప్రగతి శిక్షా యోజన స్కీం ద్వారా కాలేజీ విద్యార్థులకు ఏటా రూ.3వేల ఆర్థికసాయం అందిస్తారు. కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తారు. జమ్మూ నగరంలో ఐటీ రంగం కోసం స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్)ను ఏర్పాటు చేస్తారు. శ్రీనగర్‌లో అమ్యూజ్‌మెంట్ పార్కును ఏర్పాటు చేస్తారు. గుల్మార్గ్, పహల్గాంలను టూరిస్టు ప్రాంతాలను డెవలప్ చేస్తారు. జమ్మూలోని తావి నదీతీర ప్రాంతాన్ని అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేస్తారు. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో వాటర్ స్పోర్ట్స్, టూరిజంను ప్రోత్సహిస్తారు. చిన్నతరహా వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు భూమి సంబంధిత సమస్యలు, లీజు ఒప్పందాల సమస్యలను పరిష్కరిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఉచిత విద్యుత్, హర్ ఘర్ నల్ సే జల్ స్కీం ద్వారా ఉచితంగా తాగునీటి సప్లై చేస్తామని కమలదళం ప్రకటించింది. వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించే పెన్షన్‌ను మూడింతలు పెంచి ప్రతినెలా రూ.3వేల దాకా అందిస్తామని తెలిపింది. టీకా లాల్ తాప్లూ విస్థాపిత్ సమాజ్ పునరావాస్ యోజన ద్వారా కశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కశ్మీర్‌కు వచ్చే శరణార్ధులకు సహాయసహకారాలను అందిస్తామని ప్రకటించింది. కశ్మీర్‌లోని వాల్మీకీ, గోర్ఖా వర్గాల ప్రజలకు చేయూత అందిస్తామని తెలిపింది. కశ్మీర్‌లో రొహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమంగా నిర్మించుకున్న కాలనీలను తొలగిస్తామని మేనిఫెస్టోలో కమలదళం ప్రకటించింది.


Similar News