దక్షిణాదిలోనూ బీజేపీ హవా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తూర్పు, దక్షిణ భారతదేశంలో బీజేపీ అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీమా వ్యక్తం చేశారు.

Update: 2024-05-29 06:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తూర్పు, దక్షిణ భారతదేశంలో బీజేపీ అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకోనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. తాజాగా ఈయన ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ఇప్పటికే నార్త్ ఇండియాలో బలమైన శక్తిగా ఉన్న బీజేపీ సౌత్ ఇండియాలోనూ విస్తరించేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, దానికి తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోనూ గణనీయమైన ఆధిక్యతను కనబరుస్తామని చెప్పారు. 42 స్థానాలకు గాను 24 నుంచి 30 స్థానాలకు గెలుచుకుంటామని వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనూ సత్తా చాటుతామని తెలిపారు. ఆంద్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌, ఒడిశాతో కూడిన తూర్పు జోన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తామన్నారు. ‘అబ్ కి బార్ 400 పార్’ అనేది కేవలం నినాదమా లేక వాస్తవాల ఆధారంగా ఉద్దేశించబడిందా  అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో సంపూర్ణ మెజారిటీ నినాదంతో గెలిచాం. 2019లోనూ మాకు పూర్తి మెజారిటీ వచ్చింది. అలాగే ఈసారి 400 సీట్లు ఖాయమని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే తేల్చేశారు’ అని చెప్పారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన అమిత్ షా..ఒడిశా తమ 25ఏళ్ల పాలనను కోల్పోయిందని ఆరోపించారు.


Similar News