Omar Abdullah: కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి

Update: 2024-10-11 18:14 GMT

- లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఒమర్ అబ్దుల్లా భేటీ

- 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కలిశారు. శ్రీనగర్‌లోని రాజ్‌భవన్ వెళ్లిన ఆయన కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని వెల్లడించారు. కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడం, తొలిసారి ఎన్నికలు జరగడం వంటి కారణాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు కొంత జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది.

‘నేను రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ(ఎం), నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు లేఖలను సమర్పించాను. ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓ డేట్ ఫిక్స్ చేయాలని కోరాను.’ అని ఒమర్ అబ్దుల్లా వివరించారు. ‘ఒక ఎన్నికైన ప్రభుత్వం నుంచి మరోదానికి అధికారాన్ని మార్చినంత సులువుగా ఇక్కడ ప్రక్రియ ఉండదు. జమ్ము కశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఓ డాక్యుమెంట్ రూపొంది రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. ఆ ఫైల్ అక్కడి నుంచి కేంద్ర హోం శాఖకు వెళ్లిన తర్వాత తిరిగి వస్తుంది. ఇదంతా రెండు మూడు రోజుల్లో అయిపోతుందని మాకు తెలియజేశారు’ అని ఒమర్ అబ్దుల్లా వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు 42 సీట్లు, కాంగ్రెస్ ఆరు సీట్లు, ఆప్, సీపీఐ(ఎం) చెరో సీటు గెలుచుకోగా ఏడుగురు స్వతంత్రులు గెలుపొందారు.

Tags:    

Similar News