రాహుల్ జీ స్పందించండి.. బీజేపీ నోటీస్ పై లోక్ సభ సెక్రటేరియట్
సభా హక్కులు ఉల్లంఘించారంటూ రాహుల్ గాంధీకి బీజేపీ నోటీసులు పంపింది.
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై స్పందించాలని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది. లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ నేత నిషికాంత్ దూబే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 7న లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈక్రమంలోనే బీజేపీ నేత నిషికాంత్ దూబే రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాస్తూ.. మోడీ ప్రతిష్టను దెబ్బ తీసేలా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను రూల్ 380 ప్రకార రికార్డ్ నుంచి తొలగించాలని కోరారు. ఫిబ్రవరి 15లోగా తన స్పందనను తెలియజేయాలని లోక్‌సభ సెక్రటేరియట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది.